UPSC: ఐఏఎస్ కు ఎంపికైనట్లు పొరబడ్డ వికారాబాద్ యువకుడు.. గ్రామస్థులు, నేతల సన్మానం

  • ఫలితాల్లో పేరు చూసుకున్నాక స్నేహితులకు చెప్పిన తరుణ్ కుమార్
  • హాల్ టికెట్ నెంబర్ సరిచూసుకోక పోవడంతో పొరపాటు
  • తాజాగా ఆ ర్యాంకు హరియాణా యువకుడిదని గుర్తించిన వైనం
Confussion In UPSC Results Vikarabad Youth believed As selected to IAS

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఫలితాల్లో తన పేరు చూసుకుని మురిసిపోయాడు.. ఐఏఎస్ కు ఎంపికయ్యాడని తెలిసి బంధుమిత్రులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. తీరా చూస్తే ఆ ర్యాంకు వచ్చింది తనకు కాదని హరియాణాకు చెందిన మరో యువకుడికని, ఫలితాల్లో ఇంటిపేరు లేకపోవడంతో పొరపాటు జరిగిందని గుర్తించినట్లు వాపోయాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన యువకుడికి ఎదురైన అనుభవిమిది.

ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడురు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ కు 231 ర్యాంకుతో ఐఏఎస్ కు సెలక్ట్ అయినట్లు ప్రచారం జరిగింది. ఫలితాల్లో తరుణ్ పేరు, ర్యాంకు 231 చూపించడంతో తనే ఎంపికైనట్లు తరుణ్ కుమార్ భావించాడు. హాల్ టికెట్ నెంబర్ సరిగా గమనించలేదు. ఇంటిపేరు ప్రచురించకపోవడంతో తనకే ర్యాంకు వచ్చిందని భావించి బంధుమిత్రులకు చెప్పాడు. ఈ విషయం తెలిసి గ్రామస్థులతో పాటు స్థానిక నేతలు తరుణ్ కుమార్ ఇంటికి వెళ్లి సన్మానించారు. అయితే, తాజాగా హాల్ టికెట్ సరిచూసుకున్నాక ఆ ర్యాంకు వచ్చింది తనకు కాదని, హరియాణాకు చెందిన తరుణ్ అనే యువకుడికని తెలిసింది. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు తరుణ్ కుమార్ మీడియాకు అందుబాటులోకి రాలేదు.

More Telugu News